Back
Home » సంబంధాలు
మీ బాయ్ ఫ్రెండ్ ను దూరం చేయాలి అని అనిపించడానికి కారణాలు
Oneindia | 7th Jul, 2018 02:01 PM

మీరు మీ బాయ్ ఫ్రెండ్ ని ఎందుకు వదిలేయాలి అని అనుకుంటున్నారు? మీకంటూ ఒక ఆలోచన ఉండాలి?

ఎందుకో నచ్చడం లేదు, అసలెందుకు నచ్చడం లేదు? అన్న ప్రశ్న మీకు తలెత్తుతుంది. అలాంటి ఆలోచనలు రావడానికి కొన్ని కారణాలు ప్రధానంగా ఉంటాయి.

జీవితంలో మనం ఏదైనా సంబంధాన్ని కొత్తగా ప్రారంభించే క్రమంలో, కొన్ని అంశాలను పట్టించుకోము కూడా. కానీ భవిష్యత్తులో అవే అంశాలు సంబంధాలలో అడ్డంకులుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. క్రమంగా కొన్ని లక్షణాలు తీవ్రంగా మారి, అతని చెంత ఉండాలంటేనే చిరాకుగా అనిపించవచ్చు. ఈ కారణాల వల్లనే మీరు అతన్ని విడిచిపెట్టి, సరికొత్త జీవితం ప్రారంభించి, ముందుకు సాగాలన్న ఆలోచన కూడా రావొచ్చు. ఒక్కోసారి ఆ నిర్ణయమే అనివార్యం కావొచ్చు.

నిజమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మనసుకు అత్యంత కష్టమైన చర్యగా ఉంటుంది. కానీ, నిర్ణయాలు ఆలస్యమయ్యే కొద్దీ పరిస్థితులు చేయి దాటిపోయి, ఉనికే ప్రశ్నగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలు, తెలివిగా మరియు ఆలస్యం చేయకుండా తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ప్రేమ, గౌరవం మరియు నమ్మకం వంటి అంశాలనందు, ఆలోచనా ప్రక్రియలో కూడా సమానత్వం ఉండాలి. కానీ సమానత్వం ఉందా? ఈ విషయాలను గుర్తించడానికి ఏం చేయాలి? వీటిని ఎలా అర్థం చేసుకోవాలి?

ఈ క్రింది కారణాలు మీరు కోరుకునే సమాధానాలను మీకు అందిస్తాయి. క్రమంగా మీ నిర్ణయం సరైనదో కాదో తెలుస్తుంది.

1. నాటకీయతను జోడించిన మాటలు

అతను మీ భావోద్వేగాలకు విలువివ్వని పక్షంలో, లేదా మీ భావ వ్యక్తీకరణ స్వేచ్చకు అడ్డుగా ఉన్న ఎడల మీరు అతని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరియు భావోద్వేగాలను నాటకంగా పరిగణిస్తుంటే స్వీయ గౌరవం ఉన్న వ్యక్తి ఎవరైనా సహించలేరు. మనసు భాదకు గురైనప్పుడు, భాగస్వామిగా భావించిన వ్యక్తి సేదతీర్చేలా ఉండాలి కానీ, సూటిపోటి మాటలతో మనస్సు చివుక్కుమనేలా చేయకూడదు. ఇటువంటి వ్యక్తులు మానసిక ప్రశాంతతకు సరిపడకపోగా ఒత్తిడి పెంచే కారకులుగా ఉంటారు.

జీవితం అన్నాక ఒడిదుడుకులు సర్వసాధారణం, క్రమంగా మనసు భాదకు గురయ్యే క్షణాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆర్ధిక, కుటుంబ, ఆరోగ్య, సన్నిహితుల వంటి పలు అంశాల ద్వారా. అలాంటి సమయంలో ప్రియుడు కూడా ఒత్తిడి కారకంగా మారితే, ఆ భాద వర్ణనాతీతం. ఇటువంటి వ్యక్తులు జీవితంలో ఎన్నో ప్రతికూల, మానసిక సమస్యలకు కారకులుగా మారుతుంటారు. కావున మీ భావాలను గౌరవించని వారి పట్ల కఠినంగా ఉండడం తప్పుకాదు.

2. చెప్పిన పనల్లా చెయ్యాలంటే కుదరదు

ప్రేమను అడ్డం పెట్టి పనులకు పురమాయించే వారు ఎక్కువగా ఉన్నారు ఈ కాలంలో. కొందరిని చూస్తుంటే, పని చేయించుకోవడం కోసం ప్రేమ అనే ఆయుధం వాడుతున్నారన్న ఆలోచన కలగకమానదు. నన్ను నిజంగానే ప్రేమిస్తే ఈ పని చెయ్, అని అడిగే వాళ్లకు నిజంగా ప్రేమ విలువ తెలుసా అన్న ప్రశ్న మీకు కలగాలి. తద్వారా సంబంధాన్ని కొనసాగించాలా లేదా అన్న ఆలోచన చేయడం మంచిది. మీ భావోద్వేగాలను అతను తన పనుల కోసం వాడుకుంటున్నారన్న భావన మెదిలితే, మీరు అతని పట్ల హేయ భావాన్ని కలిగి ఉంటున్నారని అర్ధం. సంబంధంలో ఈ అజమాయిషీ తత్వాలు ప్రమాదకరం. ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. కావున నిర్ణయానికి ఇదే సరైన సమయం.

ప్రేమలో స్వార్ధం కూడదు అంటారు. భావోద్వేగాలను అడ్డుపెట్టి, తన పనులకోసం మిమ్ములను వాడుకోవచ్చు కూడా. ఇటువంటి స్వార్థపూరిత చర్యలకు పాల్పడుతూ కూడా మీ ప్రేమను నిరూపించమని శంకించే మాటలు మాట్లాడుతుంటే, అతను ప్రేమ అనే పదం పలకడానికి కూడా అనర్హుడు. ప్రేమలో స్వార్ధం కూడదు, ఇది ఎల్లప్పుడూ ఇవ్వడం అనే రూపంలోనే ఉంటుంది.

3. పాత ప్రియురాలితో పోలికలేస్తున్నారా?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రేమలలో విజయావకాశాలు తక్కువగా ఉంటున్నాయి. ఆకర్షణ, వయసు మొదలైన అనేక అంశాల వలన ప్రేమ అనే పదానికే అర్ధాన్ని మార్చేస్తున్నారు అనేకులు. అలాగని ప్రేమలో విఫలమైన వాళ్ళందరూ అదే కోవకి చెందిన వారు అనడం మూర్ఖత్వమే అవుతుంది. ఒక ప్రేమ విఫలం చెందడానికి అనేక కారణాలు ఉంటాయి. నాణేనికి ఒకే వైపు చూడడం కూడా తప్పే. కానీ కొందరు వ్యక్తులు ఆ జ్ఞాపకాల నుండి బయటకి రాలేక సతమతమవుతూ ఉంటారు., మరియు తమ ప్రస్తుత ప్రియురాలిని, పాత ప్రియురాలితో లేదా తమకు తెలిసిన వ్యక్తులతో పోలిక వేస్తూ భాధపెడుతుంటారు. ఎన్నిసార్లు వారికి నచ్చజెప్పినా వైఖరి మార్చుకోరు. కానీ దీనిని ఎంతకాలం మాత్రం ఏ స్త్రీ సహిస్తుంది. ఇతరులతో పోల్చే హక్కు ఎవరికీ లేదు, ప్రేమ పేరుతో అలా పోల్చి కించపరచడం భావ్యం కాదు. ఇటువంటి చర్యలను ఆత్మగౌరవం కలిగిన ఏ వ్యక్తి కూడా సహించలేరు. అంతగా ఆ అమ్మాయే నచ్చితే, వారితోనే సంబంధాన్ని కొనసాగించవచ్చు కదా అన్న ఆలోచన మనసులో మెదులుతుంది.ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తిలోనూ ఒక్కో స్పెషల్ ఉంటుంది. ఒకరితో పోల్చి చూడడం అనేది ఎన్నటికీ తప్పే. మీరేమీ వస్తువు కాదు, పోల్చడానికి. మీరు చెప్పినా అతని వైఖరిలో మార్పు రాకుంటే, సున్నితంగా సంబంధం నుండి గెంటివేయండి. వీరి వలన సంతోషాల సంగతి దేవుడెరుగు, నిరాశా నిస్ప్రుహలే జీవితంగా మారుతాయి.

4. ఎల్లప్పుడూ మిమ్మల్ని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా

కొందరు తామే గొప్ప అన్న ఆలోచనలలో ఉంటూ, ఇతరులను తెలివి తక్కువ వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ కారణం చేత సంబంధంలో ఉన్నా కూడా ఒంటరితనం ఆవహిస్తూ ఉంటుంది. అలాంటి చర్య ఎప్పుడు ప్రశంసించబడదు మరియు మీరు రాయి కాదు మనసు లేకపోవడానికి. మీ మనోభావాలను గౌరవించని స్థానంలో మీ ఉనికి కూడా ప్రశ్నార్ధకమే అని మరవొద్దు. ఇటువంటి వైఖరి ప్రదర్శించే వాళ్ళను స్నేహితులలోనే సహించలేము, ఇక జీవితంలోనికి ఆహ్వానిస్తామా?, ఇటువంటి వ్యక్తులు చేయని తప్పులకు కూడా నిందలు వేసే అవకాశాలు ఉన్నాయి. కావున వీలయితే సాగనంపడమే మంచిది.

5. అడుగడుగునా అడ్డుపడుతున్నాడా

ప్రతిమనిషికీ తమకంటూ ఇష్టపడే అంశాలు ఉంటాయి. కెరీర్, కుటుంబం, డ్రెస్సింగ్, మేకప్, షాపింగ్, ఆభరణాలు, ఆటలు వంటి అంశాలు అనేకం. మీ ప్రతి ఇష్టం, ఒకరి అనుమతితోనే అన్న ఆలోచన మనసుకు కష్టంగా ఉంటుంది. మీ హక్కులను కాలరాసే వ్యక్తులను జీవితంలో కొనసాగించలేరు. కానీ కొందరు మీ మంచికోసం చెప్తారు, అవి హక్కులు కాలరాయడం కాదు. మీ జాగ్రత్త కోరుకుంటున్నారని అర్ధం. పూర్తిగా వీరి పట్ల ఒక అవగాహన ఉన్న ఎడల, నిర్ణయాలు తీసుకోవడం మంచిది.