Back
Home » విహారం
ఆనందడోలికల్లో ముంచెత్తే గిరిడి అందాలు..!!
Native Planet | 6th Jun, 2019 06:03 PM
 • పరస్నాథ్ హిల్స్:

  సముద్ర మట్టానికి సుమారు 4480 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఎత్తైన కొండ ప్రాంతాన్ని పరస్నాథ్ హిల్స్ లేదా శ్రీ సమ్మెట శికర్జిగా పిలుస్తారు. గిరిడి కొండ శ్రేణులలో పరస్నాథ్ హిల్స్ 1350 మీటర్ల ఎత్తైన శిఖరంజ ఇది జార్ఖండ్ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. అంతే కాదు, హిమాలయాల్లోని దక్షిణ భాగంలో కూడా అత్యంత ఎత్తైన పర్వతంగా పేరుగాంచినది. ఈ ప్రాంతం 1775 కాలం నాటి పురాతన జైన ఆలయంగా పరిగణించబడుతోంది. ఇది జైనుల పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతున్నది. కొండ మార్గాన ప్రయాణించే పర్యాటకులకు దారిపొడవునా తీర్థంకరుల కొరకు అంకితం చేసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కొన్ని ఆలయాలు 2000సంవత్సరాల కంటే పురాతనమైనవిగా చెబుతారు. ఇక్కడ ట్రెక్కింగ్ కు అనుకూలమైన ప్రదేశం. ఇంకా పారాగ్లైడింగ్, పారాసైలింగ్ వంటి కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ కు అనుకూలమైనది.


 • హరిహర్ ధామ్ :

  గిరిడి జిల్లాలో ప్రసిద్ది హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి హరిహర్ ధామ్. దీనిని హరిహర్ ధామ్ ఆలయం అని కూడా పిలుస్తారు. 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం చుట్టూ ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. 65 అడుగుల ఎత్తున్న శివలింగం ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగంగా ప్రసిద్ది చెందింది. ఈ భారీ శివలింగాన్ని పూర్తిచేయడానికి సుమారు 30సంవత్సరాలు పట్టిందని స్థానికులు చెబుతుంటారు. జిల్లా కేంద్రానికి నైరుతి దిశన 60కిలోమీటర్ల దూరంలో హరిహర్ ధామ్ ఉంది.


 • ఉశ్రి జలపాతం

  గిరడి జిల్లాలో తుంది రోడ్ ను ఆనుకుని ఉన్న జలపాతమే ఉశ్రి జలపాతం. పరస్నాథ్ కొండల చుట్టూ ఆవరించి ఉన్న అటవీ ప్రదేశంలో పరవళ్ళు తొక్కుతూ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ జలపాతం నల్లని రాళ్ళను దాటుకుంటూ కనిపించే స్వచ్ఛమైన నీటి ప్రవాహ సవ్వడులు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.


 • మధుబన్ మ్యూజియం :

  మధుబన్ ఒక చిన్న పర్యాటక ప్రదేశం . ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలు వంద ఏళ్ళ చరిత్ర ఉన్నట్లు ఇక్కడి వారి నమ్మకం. జైన్ మ్యూజియంలో ఉన్న ప్రాచీన జైన్ గ్రంథాలు, అచ్చు ప్రతులు, పురాతన విగ్రహాలు పర్యాటకులకు అనేక చారిత్రక వాస్తవాలను తెలియజేస్తాయి. ఈ మ్యూజియం బాల్కనీల నిల్చొని సందర్శకులు పరస్నాథ్ ఆలయాన్ని టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు. పరస్నాథ్ ఆలయానికి ట్రెక్కింగ్ ప్రయాణం చేయాలంటే మధుబన్ నుండి మొదలుపెట్టాలి. మధుమన్ గిరిడి నుండి 28కిలోమీటర్ల దూరంలో, పరస్నాథ్ నుండి 10కిలోమీటర్ల దూరంలో ఉంది . మధుబన్ వద్ద ఉన్న విశ్రాంతి నివాసాలు అలసటతో వచ్చే సందర్శకులు సేదతీరేందుకు ఉపయోగపడుతాయి.


 • ఖందోలి:

  గిరిడికి నార్త్ ఈస్ట్ లో 10కిలోమీటర్ల దూరంలో ఖందోలి ఉంది. పక్షి ప్రేమికులు అన్వేషించడానికి అసంఖ్యాకమైన పక్షి జాతులు ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆరు వందల ఎత్తులో ఉన్న వాచ్ టవర్ పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. బోటింగ్ తో పాటు రాక్ క్లైంబింగ్, పారాసైలింగ్ కయాకింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి, హిమాలయ బెల్ట్‌, ఆఫ్రికా,ఉత్తర ఆసియా, ఆస్ట్రేలియా నుండి వచ్చే వలసపక్షులు ఖందోలి లేక్‌ చుట్టూ కనిపిస్తాయి. అతిపెద్ద నీటికాకి, సైబీరియన్‌ డక్‌, సైబీరియన్‌ క్రేన్‌, బ్రాహ్మినీ ఆడబాతు వంటి నలభై రకాల పక్షులు ఉన్నాయి. ఆహ్లాదకరమైన ఇక్కడి వాతావరణంలో వీటిని పునరుత్పత్తి చేయటం ఓ ప్రత్యేకం. గ్రానైట్‌ రాళ్లతో ఏర్పడిన ఖందోలి హిల్‌ను రాక్‌ క్లైంబింగ్‌, తాళ్ళతో అధిరోహించడం మరచిపోలేని అనుభూతుల్ని మిగుల్చుతాయి.


 • ఎలా చేరుకోవాలి?

  విమాన మార్గం:
  నేరుగా విమాన మార్గంలో వెళ్ళేందుకు గిరిడిలో విమానాశ్రయం లేదు. సమీప విమానాశ్రయాలు రాంచిలోని బిర్సా ముండా విమానాశ్రయం 208 కిలోమీటర్ల దూరంలో, గయా విమానాశ్రయం 201 కిమీ దూరంలో, పాట్నాలో లోక్‌ నాయక్‌ జయప్రకాష్‌ విమానాశ్రయం 265 కిమీ దూరంలో, కొలకతాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 312 కిమీ దూరంలో ఉన్నాయి.
  రైలు మార్గం:
  రైలు మార్గం ఒక ప్యాసింజర్‌ రైలు మధుపూర్‌ జంక్షన్‌ నుండి గిరిడి స్టేషన్‌కు ప్రతిరోజూ ఐదుసార్లు నడుస్తుంది. వీటి మధ్య 54 కిమీ దూరం ఉంటుంది. గిరిడి నుండి 48 కిమీ దూరంలో మరొక ముఖ్యమైన స్టేషన్‌ పరస్నాథ్‌ స్టేషన్‌ ఉంది. నేరుగా ఒక రైలు గిరిడి నుండి కొలకతా, పాట్నాకు నడుస్తుంది.
  రోడ్డు మార్గం:

  రోడ్డు మార్గం గిరిడి రహదారులు ద్వారా బాగా అనుసంధానించబడింది. గిరిడి NH-2, NH-100 కూడలి వద్ద ఉంది. బస్‌ టెర్మినల్‌ నగరం మధ్యలో ఉండుటం వల్ల సులభంగా చేరవచ్చు. ప్రైవేట్‌, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. రవాణాకు ఇతర మార్గాలుగా ఆటోలు,రిక్షాలు, మినీ బస్సులు, ప్రైవేటు టాక్సీలు ఉన్నాయి.
కొండకోనలు, గలగలపారే సెలయేళ్ళు, ప్రకృతి అందాలు పర్యాటకులకు పచ్చని తివాచీ పరిచి ఆహ్వానం పలికే గిరిడి అందాలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే. ఇరుకైన లోయల మధ్య జాలువారే జలపాతాల సవ్వడులు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. పచ్చని ప్రకృతి మధ్య వినసొంపైన కిలకిల రావాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ ప్రకృతి పరిమళాల సమ్మేళనమే గిరిడి. మరి ఆ కొండ కోనలలో దాగిఉన్న ప్రకృతి అందాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం..

జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి ప్రాంతం ఎత్తైన కొండల మద్య ఉండటం వల్ల దేశ విదేశీయ సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది. గిరిడి ప్రాంతంలో అధికంగా లభించి రూబీ మైకా, బొగ్గు ఖనిజ నిల్వలకు నిలయం. గిరిడి అంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న కొండలు, గుట్టలు గల భూమి అని అర్థం. ఇక్కడ అత్యధిక బాగం అడవులతో నిండి ఉంటుంది. చాలా వరకు సాల్ వెదురు, స్మాల్, మహు, పాలస్ వంటి చెట్లను ఇక్కడ అధికంగా చూడవచ్చు. వీటితో పాటు ప్రకృతి పరంగా ఆనందడోలికల్లో ముంచెత్తే కొన్ని ప్రదేశాల గురించి మీకోసం..